భూమి అంటే కేవలం ఆస్తి కాదు.. అది రైతు జీవితానికి పునాది, భవిష్యత్తుకు భరోసా, తల్లితో సమానమైన విశ్వాసం. అలాంటి భూమిపై ఎవరైనా కన్నేయకుండా, రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూ రికార్డుల్లో ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా డిజిటల్ భద్రతతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని, ఎవరైనా రికార్డులు మార్చే ప్రయత్నం చేస్తే నేరుగా జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ గ్రామ సభలో సీఎం పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలను స్వయంగా పంపిణీ చేసి, అందులోని వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది రైతుల నుంచే తెలుసుకున్నారు. భూ సమస్యలపై ప్రజల్లో ఉన్న ఆందోళనలను ఆయన గమనించి, వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
భూ సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. తనకు అందుతున్న ఫిర్యాదుల్లో దాదాపు 80 శాతం భూములకు సంబంధించినవేనని చెప్పారు. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా 9వ తేదీన రైతుల వద్దకు తానే వస్తానని ప్రకటించారు. అధికారులు కూడా లంచాలకు తావు లేకుండా నిజాయితీగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
వైసీపీ నేతలు చేస్తున్న పరామర్శల పేరుతో బలప్రదర్శనలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. బలప్రదర్శనలు ఎన్నికల సమయంలో చూపాలని, మిగతా సమయంలో ప్రజాసేవకు అంకితం కావాలని హితవు పలికారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించబోనని, అవసరమైతే తాట తీస్తానని వైసీపీ నాయకులకు ఘాటుగా హెచ్చరించారు. “చిత్రగుప్తుడిలా అన్నీ రాసుకుంటున్నాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి.
మీ భూమిపై ఆయన ఫొటో ఎందుకు?
తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై ఇతరుల ఫొటోలు పెట్టుకోవడానికి జగన్ ఎవరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. “మీ భూమిపై వేరేవాళ్ల ఫొటోలు ఎందుకు? నువ్విచ్చావా? నీ తండ్రి ఇచ్చాడా? నీ తాత ఇచ్చాడా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట వివాదాస్పద భూములపై పెత్తనం చెలాయించేందుకు పులివెందుల నుంచి తెచ్చిన మనుషులతో పొలాలు, స్థలాలు కాజేసే కుట్రలు జరిగాయని ఆరోపించారు.
సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకోవడానికి రూ.700 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం అత్యంత దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు. ప్రతి గ్రామంలోనూ వైసీపీ రౌడీలకు తక్కువ ధరకు భూములు ఇచ్చే పరిస్థితి తీసుకువచ్చారని, ఒప్పుకోకపోతే 22-ఏలో పెట్టి భయపెట్టారని అన్నారు. లక్షల ఎకరాల భూములు ఇలా కాజేశారని ఆరోపించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇక నుంచి రైతుల భూమిపై ఎవరూ కన్నేయకుండా క్యూఆర్ కోడ్ ఆధారిత భద్రతతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రైతు తన భూమి వివరాలన్నీ ఫోన్‌లోనే చూసుకోవచ్చని తెలిపారు. భూ రికార్డులు పూర్తిగా భద్రంగా ఉంటాయని, ఎవరైనా తారుమారు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పటిష్ఠంగా సర్వే ప్రక్రియ చేపడుతున్నామని, ఈ నెలలోనే 279 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 1.16 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌లోగా 18 లక్షల పాస్‌పుస్తకాలు ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు. ఇప్పటివరకు 37.40 లక్షల పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా 9,500 గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉందన్నారు. మొత్తం 62 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
రాయలసీమ లిఫ్ట్ పేరిట డ్రామాలు
ముచ్చుమర్రి లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తే కరువు నేల సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు అన్నారు. కానీ వైసీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ పేరిట రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అవసరమైన అనుమతులు లేకపోవడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆ ప్రాజెక్టును నిలిపివేసిందని గుర్తు చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కూడా జగన్ హయాంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు. ఐదేళ్లపాటు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేశారని, ఇప్పుడు మాత్రం కల్తీ కాలేదని మాట్లాడటం విడ్డూరమన్నారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా కల్తీ జరిగిందని చెప్పారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు లడ్డూ నాణ్యతలో తేడా అందరికీ తెలుస్తోందని అన్నారు.
పోలవరం, పరిశ్రమలు పూర్తి చేస్తాం
పోలవరం ప్రాజెక్టును జగన్ శనీశ్వరుడిలా ముంచేశారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసి రూ.400 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లతో మళ్లీ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని దేశానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. . ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక పార్కుల అభివృద్ధితో పాటు రాయలసీమ ఉక్కు పరిశ్రమను కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు.
కాకి లెక్కలు వద్దు.. కరెక్ట్ లెక్కలు చెప్పండి
గ్రామ ప్రగతి వివరాలు చెబుతూ పంచాయతీ కార్యదర్శి కలుగొట్ల తలసరి ఆదాయం రూ.26,800 అని చెప్పడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తలసరి ఆదాయం రూ.1.85 లక్షలు, ఎమ్మిగనూరు నియోజకవర్గం రూ.1.25 లక్షలు ఉండగా, గ్రామ ఆదాయం అంత తక్కువగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. “కాకి లెక్కలు చెప్పొద్దు. కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశాలకు చదువుకుని రావాలి” అంటూ అధికారులను చురకలంటించారు.
మా ఆస్తిపై భరోసా వచ్చింది: రైతు స్పందన
కలుగొట్లకు చెందిన రైతు బుడగ జంగాల నడిపన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం జగన్ ఫొటోతో పాస్‌పుస్తకాలు ఇవ్వడం తమకు నచ్చలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకం రావడంతో తమ ఆస్తిపై భద్రత, నమ్మకం పెరిగిందని చెప్పారు. బుడగ జంగాల కులం సర్టిఫికెట్ సమస్యపై సీఎం స్పందిస్తూ, కేంద్ర చట్టం వచ్చే వరకు ఎస్సీలకు అందే అన్ని పథకాలు వీరికి అందించాలని ఆదేశించానని తెలిపారు.
కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














Leave a Reply